ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట మే 29 : 12 రోజులుగా కొనసాగుతున్న వీఓల సమ్మె: మోకాళ్లపై నిరసన తెలిపిన మహిళలు!

ఏక్ దం న్యూస్ రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల విలేజ్ ఆర్గనైజర్స్ (వీఓ)లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన సమ్మె శుక్రవారానికి 12వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 వేల మంది వీఓలు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దాదాపు 46 మంది వీఓలు గత 12 రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం (MPDO) ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే, తమ ఆందోళనలపై అధికారులు, ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.​ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం నిరసనను ఉధృతం చేస్తూ మహిళా వీఓలంతా మండల పరిషత్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని, అధికారులు వెంటనే స్పందించి తమ కనీస వేతనాన్ని రూ. 20,000 లకు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని మహిళా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు