ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని చిక్కుడువానిపల్లి, పెద్దలింగాపూర్, దాచారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడా తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద రైతులతో పాటు ఐకేపీ (IKP) సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక తహసిల్దారు సురేష్ నుంచి ఇప్పటివరకు జరిగిన కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలను, అలాగే హమాలీలను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు అండగా నిలవాలని ఆయన అధికారులకు సూచించారు.