ఏక్ దం న్యూస్ (ఇల్లంతకుంట):
మండల పరిధిలోని రహీంఖాన్ పేట గ్రామంలో కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన దొంతి పద్మ ఐకేపీ (IKP) సెంటర్ వీఓఏగా పనిచేస్తున్నారు. జూన్ 1న అదే గ్రామానికి చెందిన ఏనుగుల నరేష్, అతని తండ్రి ఏనుగుల మల్లయ్యలు కలిసి పద్మ ఇంటిపైకి వచ్చారు. బాధితురాలిని కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె మరిది దొంతి సుధాకర్, భర్త దొంతి మల్లయ్యలపై చేతులతో దాడి చేసి కొట్టారు.బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు ఏనుగుల నరేష్, ఏనుగుల మల్లయ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.