ఏక్ దం న్యూస్/వేములవాడ, జూన్ 02: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన గొప్ప నేత కెసిఆర్,నాడు అభివృద్ధి దిశగా దూసుకెళ్లిన తెలంగాణ. నేడు తిరోగమన దిశలో ఉంది :బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడిపల్లి వివేక్ రెడ్డి

ఏక్ దం న్యూస్/వేములవాడ, జూన్ 02:
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ప్రజల కలను సాకారం చేసిన మహా నేత కెసిఆర్ అని మేడిపల్లి వివేక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ వంటి దార్శనికులు,వైతాళికులు,మహా నాయకులు ఎప్పుడో వందల ఏళ్ల కు ఒకసారి పుడతారని,తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు నడిపి అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు.కెసిఆర్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రైతు బందు,మిషన్ కాకతీయ ,మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశపెట్టి దేశం గర్వించే విధంగా గొప్పగా అభివృద్ధి చేశారని తెలిపారు.అదేవిధంగా రైతుబంధు,బీమా పథకాలను పేర్లు మార్చి పలు రాష్ట్రాలు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు
ఒకప్పుడు అభివృద్ధి దిశగా దూసుకెళ్లిన తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ తిరోగమన దిశలో నడుస్తోందని విమర్శించారు. ఎక్కడ చూసినా నిరాశే కనిపిస్తోందని, అటు రైతులు ఆవేదనలో, ఇటు నిరుద్యోగులు ఎదురుచూపుల్లో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ జరుగుతోందని అన్నారు.తెలంగాణను సాధించడం ఒక్కటే కాదు.. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజలు మరోసారి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యతిరేక శక్తుల కుట్రలను చేధించి, మన తెలంగాణను.. మన భవిష్యత్తును.. మనమే రక్షించుకోవాలని వివేక్ రెడ్డి పిలుపునిచ్చారు.