మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌లోని 'కెమిస్ట్రీ భవన్'కు విచ్చేశారు. వేడుకలు ముగిసిన అనంతరం ఆయన తిరిగి వెళ్లేందుకు భవనంలోని లిఫ్ట్ ఎక్కారు. అయితే, సామర్థ్యానికి మించి ఒకేసారి ఎక్కువ మంది లిఫ్ట్‌లోకి ప్రవేశించడంతో సాంకేతిక లోపం తలెత్తింది.
ఎమ్మెల్యేతో పాటు దాదాపు మరో ఆరుగురు ఉన్న ఆ లిఫ్ట్, ఒక్కసారిగా కిందికి జారిపోయింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియక లోపల ఉన్నవారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఇటీవలే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఇలాంటి లిఫ్ట్ ప్రమాదం నుంచే తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మానకొండూరు ఎమ్మెల్యేకు కూడా అదే తరహా ప్రమాదం ఎదురుకావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రముఖులు వచ్చే భవనాల్లో లిఫ్ట్ ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోపల ఉన్నవారంతా సురక్షితంగా బయటకు రావడంతో అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.