రైతుకు భారీ నష్టం

ఏక్ ధం న్యూస్, మానకొండూర్:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లోని రంగపేట గ్రామంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన మారం రాయలింగుకు చెందిన గొర్రెల మందపై శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 10 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 గొర్రెలు గాయపడ్డాయి.
ఈ ఘటనతో రైతుకు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న పశువైద్యులు డా. సుష్మిత, డా. అరవింద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన గొర్రెలకు చికిత్స అందించి, అవసరమైన టీకాలు వేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, సర్పంచ్ కొత్త రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ వేల్పుల కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, గొర్ల కాపర్ల సంఘ ప్రతినిధులు సంఘటనా స్థలాన్ని సందర్శించి రైతును పరామర్శించారు. బాధిత రైతుకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.